Friday, January 13, 2017

దేవాలయ నియమావళి

ఆగమ శాస్త్రములో దేవాలయములో అర్చకులు, భక్తులు, అధికారులు ఏ విధముగా వ్యవహరించకూడదో వివరించబడింది. 


  1. ఆలయము లోపల వాహనము మీదగానీ, పాదరక్షలతో గాని తిరుగరాదు.
  2. ఆలయమునకు ప్రదక్షిణము చేసి, పిమ్మట లోనికి ప్రవేశించాలి.
  3. ఆలయములోనికి తలపాగా ధరించిగాని, చేతితో ఆయుధము పట్టుకొనిగాని ప్రవేశించరాదు.
  4. ఆలయములోనికి ఉత్తచేతులతోగాని, తిలకం ధరించకుండా గాని, తాంబూల చర్వణం చేస్తూగాని, ఆహారాదులు తినుచూగాని ప్రవేశించరాదు.
  5. ఆలయ ప్రాంగణములో మల, మూత్ర విసర్జన చేయరాదు.
  6. ఆలయమందు కాళ్ళు చాపుకొని కూర్చుండుట, నిద్రపోవుట చేయరాదు.
  7. ఆలయములో ఏ ప్రాణికైనా దుఃఖం కలిగించే ఏ హింసనూ చేయరాదు.
  8. ఆలయములో ఎన్నడూ వివాదములు పెట్టుకోరాదు.
  9. ఆలయములో అహంకారముతో, గర్వముతో, అధికార దర్పముతో ఉండరాదు.
  10. ఆలయములో దేవుని ఎదుట పర స్తుతిని, పర నిందను కూడా చేయరాదు.
  11. ఆలయములో దేవుని ఎదుట పృష్ఠభాగం చూపిస్తూ కూర్చుండరాదు.
  12. అధికార గర్వంతో అకాలంలో ఆలయం ప్రవేశించి అకాల సేవలను చేయరాదు.
  13. ఒక చేతితో ప్రణామము చేయరాదు.
  14. ఆలయాలలో ఇతరులకు నమస్కరించడం చేయరాదు. భగవంతుని ఎదుట అందరూ సమానులే అని భావించవలెను.

No comments:

Post a Comment