Sunday, October 31, 2021

దీపావళి విశిష్టత.

దీపావళి అంటే ఉత్సవాలు దీపాలు, అలంకరణలు, కొనుగోళ్లు, టపాకాయలు, పూజలు, ప్రార్థనలు, బహుమతులు, ఫలహారాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు.వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.

దీపాలంకరణ మరియు లక్ష్మీ పూజ

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలొ దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు.

దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి వచ్చి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు.ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది.

అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు.తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు.ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని,సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు.తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ త్రిలోకాథిపతీ "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలిని అవుతాను అని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.

నరక చతుర్దశి

కృష్ణుడు మరియు సత్యభామ కలిసి నరకాసురడి సైన్యాలతో పోరాడుతున్న చిత్రం.ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది.నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు.కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు.అతడు లోక కంటకుడైనా మహావిష్ణువు వధించరాదని తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి.

మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది.అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు.నరకుని చెరనుండి సాధుజనులు,పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు ధ్రర్మం సుప్రతిష్ఠమైంది.

నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు.ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి.

ప్రణీత్ కుమార్ శర్మ (మల్యాల) 
8332991450.

Tuesday, June 15, 2021

మనమాట మంచి మాట- 2

కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనుకబడుతావ్
తర్వాత పరిగెత్తినా ప్రయోజనం ఉండదు.
 

మనమాట మంచి మాట - 1

మూసిన నోట్లోకి ఈగలు ఎలాగాతే దూరవో, అదే విధంగా నోరు అదుపులో ఉంచుకుంటే అనవసరపు గొడవలు తలకు చుట్టుకోవు..

Tuesday, May 25, 2021

చంద్రగ్రహణం26/05/20212021 బుధవారం రోజు గ్రహణం ఉందా లేదా గ్రహణ నియమాలు పాటించాలా వద్దా...?

శ్రీ ప్లవనామ సంవత్సర వైశాఖ పూర్ణిమ 26 మే 2021 బుధవారం వృశ్చికరాశి అనూరాధ నక్షత్రంలో కేతుగ్రస్త చంద్ర గ్రహణం సంభవించనున్నది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాన్ని గమనించిన గర్భిణిస్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా..? గ్రహణం ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఏర్పడుతున్నది..? గర్భిణి స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అని మాకు చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు, వారు పడుతున్న భయందోళనలు చూసి ఈ వ్యాసం వ్రాయడం జరిగినది.

ఈ చంద్ర గ్రహణం మన తెలుగు రాష్ట్రాల వారికి అస్సలు వర్తించదు. గ్రహణ నియమాలు ఏమి పాటించనవసరం లేదు. అన్ని పంచాంగాలు కూడా ముక్త కంఠoతో ఈ సంవత్సరం మనకు అసలు గ్రహణాలే లేవని తెలియజేస్తున్నాయి, ఇతర ప్రాంతాలలో ఎక్కడైన గ్రహణాలు ఏర్పడినా అవి మనకు వర్తించవనే తెలియజేసారు. 

                               ప్రణీత్ కుమార్ శర్మ  
            (ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు)
       (కాబట్టి, భారతీయులు  అనుసరించే ఆచారాలు వర్తించవు                      గర్భిణీస్త్రీలు నియమాలు పాటించనవసరం లేదు )

Wednesday, January 13, 2021

DNA & సంతాన నాగేంద్రుడి విగ్రహ రహస్యం..

 మన పూర్వీకులు అనగా ఋషులు మనకి ఏది అందించినా అది ఇప్పటి సైన్స్ కంటే మించిన సైన్స్.. ఎవరూ చేధించలేనిది. కాదనలేని ఓ నిజం.


పిల్లలు పుట్టని వారికి పూర్వం యోగులు గాని, ఋషులు గాని ఓ మాట చెప్పేవారు. 


రావిచెట్టు, వేపచెట్టు కలిసి ఉన్నచోట నాగేంద్రస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి పాలతో అభిషేకం చేసి 108 #ప్రదక్షిణలు చేయండి.., పిల్లలు పుడతారు అనేవారు... పాపం మన పూర్వులు అమాయకులు గనుక వారి మాట తూ.చ. తప్పకుండా పాటించి సంతానం పొందేవారు.  పాలు పోసి 108 #ప్రదక్షిణలు ఎందుకు చేయమనేవారంటే..


రావిచెట్టు, వేపచెట్టు మొదట్లో రాతితో గాని, లోహంతో గాని చేసిన విగ్రపెట్టి పాలు పోస్తే ఒక రకమైన శక్తి పుడుతుంది.. ఆ గాలి పీల్చడం వల్ల "#డిఎన్ఏ" లో మార్పులు వచ్చి పిల్లలు పుట్టడానికి సరైన వ్యవస్థ భార్యభర్తలలో ఏర్పడుతుంది.. దానివల్ల పిల్లలు పుట్టేవారు.. ఇది ఆ పూజలో ఉన్న రహస్యం.

నేడు సైన్స్ చూపిస్తున్న #డిఎన్ఏ కూడా అదే ఆకారంలో ఉంటుంది చూడండి చిత్రంలో.. కానీ ఈ సైన్స్ ఎన్ని మందులు వాడమని చెప్పిన పిల్లజల్లా లేక డబ్బులు పోగొట్టుకొని ఏడ్చేవాళ్ళు ఎందఱో ఉన్నారు.. అందుకే మన ఆచారాలు సంప్రదాయాలు, దేవీ దేవతలు ఎప్పుడూ గొప్పవారే.. సూర్యుడిని మబ్బు కమ్మితే వెలుగు తగ్గినట్లు మన #సనాతన_ధర్మం కూడా మనలోని లౌకిక వాదుల వల్ల, దుర్మార్గుల వల్ల దాని ప్రభావం తగ్గినట్లు కనబడిన మళ్ళీ మబ్బులు తొలిగిన సూర్యుడిలా ప్రకాశిస్తుంది...


సనాతన హిందూ సంప్రదాయాలు గౌరవించండి - పాటించండి..

Friday, January 1, 2021

ఆలయంలో ఇచ్చే కుంకుమ, విభూతి ని ఏమి చేయాలి చాలా మంది చేసే తప్పు ఏమిటి..?

మనందరం ప్రతిరోజూ లేదా వారానికి ఒకసారి లేదా పండుగలు, పర్వదినాల్లో సమీప దేవాలయాలను దర్శిస్తాం. స్వామి వారిని లేదా అమ్మవార్లను దర్శిస్తాం. దైవ దర్శనం అనంతరం అక్కడ ఏదైనా ప్రసాదంగా పులిహోరా, చక్రపొంగలి వంటివి ఇస్తే వెంటనే తినేయడమో లేక ఇంటికి తెచ్చుకుని తినడమో చేస్తాం.

అయితే ప్రసాదంగా కుంకుమ, విభూతి ఇస్తే చాలామంది వాటిని కొద్దిగా నుదుట పెట్టుకుని మిగిలిన దాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తారు. కొందరు ఆలయ గోడలపై లేదా ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు. 

ఆలయాల్లో ఇచ్చే కుంకుమ, విభూతి ప్రసాదాలను నుదుట ధరించాక గోడలపై లేదా ఆలయంలోని ఏదైనా ప్రదేశంలో చల్లటం చేయకూడదని పెద్దలు చెబుతారు. ఆలయంలో స్వామి వార్లను లేదా అమ్మవార్లను విభూతి, కుంకుమలతో పూజించి ఆ తర్వాత వాటిని మనకు ప్రసాదంగా ఇస్తారు. ఇలా విభూతి, కుంకుమ ప్రసాదాలు ఇవ్వడం అనేది మనతో పాటు మన చుట్టూ ఉండే వారిని రక్షించటం కోసమే.

   అలాంటి మహిమాన్వితమైన ప్రసాదాలను ఆలయాల్లోనే వదిలి వెళ్ళడం దైవ అనుగ్రహాన్ని తిరస్కరించినట్లు అవుతుంది. కాబట్టి కుంకుమ, విభూతి వంటి వాటిని కొద్దిగా నుదుట ధరించి, మిగిలిన వాటిని ఇంటికి తెచ్చుకుని, మన పూజా మందిరంలో ఉంచుకొని, ప్రతిరోజూ నుదుటన ధరిస్తే తప్పక శుభ ఫలితాలు చేకూరుతాయని శాస్త్రవచనం. మన ఇంటి చుట్టుప్రక్కల వారికి కూడా ఇస్తే మంచిది.